Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'నన్నే ప్రేమించాలి...నన్నే పెళ్లి చేసుకోవాలి' అంటూ వర్ధమాన సినీ నటికి వేధింపులు

  • వర్ధమాన నటిని వేధిస్తున్న జూనియర్ ఆర్టిస్ట్ కో-ఆర్డినేటర్
  • బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించిన వర్ధమాన నటి
  • కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు
ప్రేమిస్తే నన్నే ప్రేమించాలి, పెళ్లంటూ చేసుకుంటే నన్నే చేసుకోవాలి లేదా ముఖంపై యాసిడ్ పోస్తానంటూ వేధింపులకు దిగుతున్న జూనియర్ ఆర్టిస్ట్ కో-ఆర్డినేటర్ రాజుపై వర్ధమాన నటి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన హైదరాబాదులో చోటుచేసుకుంది. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. శ్రీకృష్ణానగర్ పిల్లర్‌ నంబర్‌ 3 వద్ద నివసించే వర్ధమాన నటి (23) ని జూనియర్‌ ఆర్టిస్ట్‌ లను సరఫరా చేసే కో–ఆర్డినేటర్‌ రాజు గత రెండు నెలలుగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు.

ప్రేమిస్తే తనను మాత్రమే ప్రేమించాలని, పెళ్లంటూ చేసుకుంటే తనను తప్ప వేరెవరినీ చేసుకోకూడదని, ఎవరితోనైనా మాట్లాడాలంటే తన అనుమతి తీసుకోవాలని, లేని పక్షంలో ఆమె క్యారెక్టర్ లేనిదని ప్రచారం చేస్తానని, ఆమె తల్లిదండ్రులకు కూడా అలాగే చెబుతానని వేధింపులకు గురి చేస్తున్నాడు. అంతే కాకుండా జేబులో యాసిడ్ సీసాతో వచ్చి, ముఖంపై యాసిడ్ పోస్తానని బెదిరింపులకు దిగుతున్నాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది.

 ఈ నెల 17న తాను నటిస్తున్న సినిమా దర్శకుడితో మాట్లాడుతుండగా, అక్కడికి చేరుకున్న రాజు, దర్శకుడితో సంబంధం ఏంటంటూ ప్రశ్నించాడని, తన బైక్‌ ఎక్కకపోతే తీవ్రపరిణామాలు ఎదుర్కొంటావని చెబుతూ బెదిరింపులకు పాల్పడ్డాడని, తనకు రక్షణ కల్పించి, అతడిపై చర్యలు తీసుకోవాలని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు.
new artist
new actress
harassment
Hyderabad

More Telugu News